• facebook
  • whatsapp
  • telegram

దేశంలో 11 లక్షలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలు  

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సర్కారు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలు లక్షల్లోకి చేరుకున్నాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉండగా...దక్షిణాదిన కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు ఎక్కువ ఖాళీలతో మొదటి 10 స్థానాల్లో ఉండటం గమనార్హం. తెలంగాణ  12వ స్థానంలో నిలిచింది. సగటున దేశంలో 18 శాతం కొలువులు ఖాళీగా ఉండగా బిహార్‌లో ఏకంగా 40 శాతానికిపైగా ఖాళీలున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి (ఎస్‌ఎస్‌ఏ పీఏబీ) సమావేశ సమయంలో ఖాళీల వివరాలను కేంద్రానికి సమర్పిస్తాయి. 2020-21 విద్యా సంవత్సరం ప్రకారం దేశంలో 11.09 లక్షల ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు కేంద్ర విద్యాశాఖే తాజాగా పార్లమెంటులో వెల్లడించింది. ఖాళీల భర్తీలో ఏళ్లు గడుస్తున్నా మార్పు రావడం లేదని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లోనూ అధికంగానే...
తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలున్నాయి. ఏపీలో 35,358 (14 శాతం), తెలంగాణలో 20,024 (13.65 శాతం) పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 1,46,623 మంజూరు పోస్టులకుగాను 1,26,599 మందే పనిచేస్తున్నారు. తెలంగాణలో మాధ్యమిక విద్య (6-10 తరగతులు) ప్రధానోపాధ్యాయుల ఖాళీలు 1,731 ఉండగా... ఈ అంశంలో దేశంలోనే 5వ స్థానంలో ఉంది. ప్రధానోపాధ్యాయ పోస్టులను 100 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌ (సబ్జెక్టు నిపుణులు) ఖాళీల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) ఖాళీలను మాత్రం పూర్తిగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (నోటిఫికేషన్ల) ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంటున్నాయి. అయితే తెలంగాణలో 2015 తర్వాత పదోన్నతులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.


దేశవ్యాప్తంగా ఖాళీలు ఇలా...

విభాగం        మంజూరు  పనిచేస్తున్నది    ఖాళీలు
ప్రాథమిక    50,01,016 41,63,424   8,37,592
మాధ్యమిక   8,38,452    6,78,152  1,60,300
సీనియర్‌   4,67,881      3,56,287     1,11,594
మొత్తం    63,07,349  51,97,863   11,09,486    

* దేశం మొత్తమ్మీద 2,79,088 ఖాళీలతో బిహార్‌ మొదటిస్థానంలో ఉండగా, 22,068 ఖాళీలతో జమ్మూకశ్మీర్‌ పదో స్థానంలో నిలిచింది.  


ఏటా నియామకాలు జరపడం తప్పనిసరి
విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం 10 శాతానికి మించి ఖాళీలు ఉండరాదు. దేశవ్యాప్తంగా అంతకు రెట్టింపు ఉంటున్నాయి. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉంటున్నా పరిష్కారానికి తగిన చర్యలు లేవు. ప్రతి ఏటా కటాఫ్‌ తేదీని నిర్ణయించి అప్పటికి ఉన్న ఖాళీలపై ప్రతి ఏటా జనవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలి. దానివల్ల బడులు తెరిచే జూన్‌ నాటికి ఉపాధ్యాయులు విధుల్లోకి వస్తారు. ప్రభుత్వ బడుల్లో 90 శాతానికిపైగా అత్యంత పేద కుటుంబాల పిల్లలే చదువుకుంటున్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే  వారు కూడా దూరమవుతారు. తెలంగాణలో 2017లో,  ఏపీలో 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. మళ్లీ ఇప్పటివరకు మరో ప్రకటన రాలేదు.
-కలపాల ఆనంద కిశోర్, మాజీ సంచాలకుడు,  ఉమ్మడి రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ 
 

Posted Date : 03-08-2021