• facebook
  • whatsapp
  • telegram

ఇలా పరీక్షలు.. అలా ఫలితాలు 

ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షలు ముగిసిన కొన్ని గంటల్లోనే ఫలితాలు ప్రకటించి ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఇంజినీరింగ్‌ కళాశాల రికార్డు సృష్టించింది. మొదటి నుంచి చివరి వరకు పరీక్షల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహించడంతో త్వరగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో గత నెల 22న బీటెక్‌ చివరి ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 27 వరకు థియరీ, 29 నుంచి 31వ తేదీ(శనివారం) వరకు వైవా పరీక్షలు నిర్వహించారు. ఆ వెంటనే ఆన్‌స్క్రీన్‌ మూల్యాంకనం చేపట్టిన ఆచార్యులు.. మార్కులు క్రోడీకరించి సోమవారం సాయంత్రం ఫలితాలు విడుదల చేశారు. వర్సిటీ చరిత్రలో తొలిసారిగా పరీక్షలు ముగిసిన ఒక్క రోజు వ్యవధిలోనే ఫలితాలు ప్రకటించామని ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.ఎం.కుమార్‌ వెల్లడించారు. మొత్తం 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
‣ 210 మంది విద్యార్థులకు కొలువులు
కరోనా మహమ్మారి సమయంలో ప్రాంగణ నియామకాల్లోనూ ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల సత్తా చాటింది. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది చదివిన 210 మంది విద్యార్థులకు కొలువులు దక్కాయి. అందులో 56 కంపెనీలు ఆన్‌లైన్‌లో పరీక్షలు, ముఖాముఖిలు నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేసుకున్నాయి. కొలువులు పొందిన వారికి అత్యధికంగా రూ.24 లక్షల ప్యాకేజీ, తక్కువగా రూ.4.5 లక్షల ప్యాకేజీ దక్కింది. అయిదుగురికి రూ.20 లక్షలకుపైగా వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్రొ.ఎం.కుమార్‌ వివరించారు. 

Posted Date : 03-08-2021