• facebook
  • whatsapp
  • telegram

అన్ని భారతీయ భాషల్లోనూ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు

దిల్లీ: ఆంగ్లం నుంచి ఒకే సమయంలో 11 భారతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్న కృత్రిమ మేధ పరికరం రూపకల్పనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను అన్ని భారతీయ భాషల్లోనూ అందించాలన్నది తన చిరకాల స్వప్నమని తెలిపారు. అఖిలభారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న బహుభాష అనువాద అనువర్తనాన్ని సోమవారం ఆ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే, ప్రధాన సమన్వయ అధికారి బుద్ధ చంద్రశేఖర్‌ ఉపరాష్ట్రపతితో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ముందు ప్రదర్శించారు. ఆంగ్లంలో ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులను ఆ పరికరం ఒకే సమయంలో 11 భాషల్లోకి...హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ, అస్సామీ, ఒడియాలోకి అనువదించింది. ఆంగ్ల పుస్తకాలు, పరిశోధనాపత్రాలు, ప్రభుత్వ దస్తావేజులు, ఆంగ్ల వీడియోలను బహు భాషల్లోకి ఈ పరికరం అనువదించగలదని ఏఐసీటీఈ బృందం వివరించింది. ఈ పరికరాన్ని మరింత మెరుగుపరిచి దేశానికి అందించాలని వెంకయ్యనాయుడు సూచించారు. అనువర్తనాన్ని రూపొందిస్తున్న ఏఐసీటీఈ కృషిని ప్రశంసించారు.

Posted Date : 03-08-2021