• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప‌రిశోధ‌న‌ల మ‌ణిపూస‌!

 

ఇంజినీరింగ్‌లో అడుగుపెడుతూనే పరిశోధనల బాట పట్టాడు... పనితీరు బాగా లేదన్న అధ్యాపకుడి నోటి నుంచే ‘భేష్‌’ అనిపించుకున్నాడు... 19 ఏళ్లకే బీటెక్‌ పూర్తి చేయటమే కాదు.. ప్రముఖ శాస్త్ర, సాంకేతిక పత్రికల్లో ఏడు పరిశోధక వ్యాసాలు రాశాడు... ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కాలర్స్‌ (ఐఎన్‌ఎస్‌సీ) నుంచి యువ పరిశోధకుడి అవార్డు అందుకున్నాడు... పలు రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించాడు... గతేడాది ఐఎన్‌ఎస్‌సీకి పరిశోధన పత్రాల సమీక్షకుడిగానూ ఎంపికైన ఆ 22 ఏళ్ల గుంటూరు కుర్రాడే తూముల మణి కోట రాజశేఖర్‌.

 

‘నీ పరిశోధక వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా లేదు’ అధ్యాపకుడి నోటి నుంచి వచ్చిన ఈ మాట రాజశేఖర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. అప్పటికి అతను చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో బీటెక్‌లో చేరి సంవత్సరమే అయ్యింది. కానీ మొదట్నుంచీ పరిశోధనల మీద ఆసక్తి చూపే తను తొలి ఏడాదిలోనే ‘వైర్‌లెస్‌ ఎలక్ట్రిసిటీ’ అంశంపై పరిశోధన పత్రం రాశాడు. యూనివర్సిటీ ఆ పత్రాలు సమీక్షించే విభాగానికి తీసుకెళ్లాడు. దాన్ని పరిశీలించిన అధ్యాపకుడు ‘ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఇదేం పేపర్‌’ అని కసిరారు. మొదట్లో కాస్త బాధ పడ్డా, కసితో మరో ఆర్నెల్లలోనే ‘ఎంబడెడ్‌ సిస్టం’ అంశంపై మరో సిద్ధాంత పత్రాన్ని తయారు చేశాడు. దాన్ని చూసిన అదే అధ్యాపకుడు ఆశ్చర్యపోయారు. ఎంతో బాగుందని మెచ్చుకోవటమే కాదు, ఆ పరిశోధనలో రాజశేఖర్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ స్వయంగా సిఫారసు చేశారు. ఆ పత్రం అదే సంవత్సరం ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమైంది. అలా బీటెక్‌ పూర్తయ్యేసరికే అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయేలా రాజశేఖర్‌వి ఏకంగా ఏడు పరిశోధన పత్రాలు అంతర్జాతీయపత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 

శాస్త్రవేత్తల మెప్పు

నలుగురిలో ఒకడిగా కాదు.. నలుగురు మెచ్చేలా ఉండాలి.. ఇదీ రాజశేఖర్‌ ఇష్టపడే మాట. 2015లో బీటెక్‌లో చేరినప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివేవాడు. వినూత్న ఆలోచనలతో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను సానబెట్టుకునేవాడు. తొలి ఆర్నెల్లలో అధ్యాపకులు, తోటి విద్యార్థులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మొదటి సంవత్సరం ముగిసే నాటికి ప్రతిభ నిరూపించుకోవడంతో క్లాసులో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 2018లో యూనివర్సిటీలో ఇస్రో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేర్వేరు విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రజెంటేషన్స్‌ తీసుకెళ్లారు. రాజశేఖర్‌ రూపొందించిన ‘టైమ్‌ ట్రావెల్‌’ పోస్టర్‌ను చూసి ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ మంత్రముగ్ధులయ్యారు. మరో శాస్త్రవేత్తతో రాజశేఖర్‌ దగ్గరికొచ్చి ‘ఈ ఐడియా నీకెలా వచ్చింది?’ అని అడిగారు. ‘ఇంటర్‌ గెలాక్టిక్‌ ఫిజిక్స్‌ మీద ఆసక్తితో చాలా వ్యాసాలు, పుస్తకాలు చదివాను. ఆ పరిజ్ఞానంతోనే పోస్టర్‌ను డిజైన్‌ చేశాను’ అన్నాడు రాజశేఖర్‌. పోస్టర్‌ రూపకల్పనకు అనుసరించిన ఈక్వేషన్స్‌ వంటివి అడిగి తెలుసుకొని మరింత మెరుగైన ఆలోచనలతో ముందుకు సాగాలని భుజం తట్టారు కిరణ్‌కుమార్‌.

 

జనాలకు ఉపయోగపడేలా..

ఏ పనిచేసినా ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడాలనేదే నా లక్ష్యం. ఆ దిశగానే ప్రయత్నించాను. బీటెక్‌ పూర్తి కాగానే హెచ్‌సీఎల్‌ కంపెనీ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యా. పరిశోధనల నుంచి సాఫ్ట్‌వేర్‌ వైపు ఎందుకు రావాలని అనుకుంటున్నావని ఇంటర్వ్యూలో అడిగారు. అన్ని రంగాల్లో విజ్ఞానం సంపాదించడం అవసరమని చెప్పా. ప్రస్తుతం డెవలపర్‌గా పనిచేస్తున్నా. భవిష్యత్‌లో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే ఉత్పత్తులను తయారుచేసే సంస్థను నెలకొల్పాలనేది నా లక్ష్యం.

 

ప్రచురితమైన పత్రాలు..

‣ ఆర్డ్యూనో కంట్రోల్డ్‌ స్పెషల్‌ స్టెయిర్‌ క్లైంబింగ్‌ వీల్‌-ఛైర్‌ బాట్‌: పూర్తి ఆటోమేటెడ్‌ వీల్‌ ఛైర్‌ను ప్రతిపాదించిన పత్రం ఇది. ఎత్తుపల్లాలు, ఎగుడు దిగుడు రహదారుల్లో.. మెట్లు ఎక్కేందుకు అనుగుణంగా ఛైర్‌ డిజైన్‌ దీని ప్రత్యేకత. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్యూర్‌ అండ్‌ అప్లైడ్‌ మేథమెటిక్స్‌’లో ప్రచురితమైంది.

 క్రియేటింగ్‌ ఏ సైంటిఫికల్‌ వే టూ ట్రావెల్‌ థ్రో టైం: కాలంలో ప్రయాణించటం కోసం వివిధ పద్ధతులు, మార్గాల ద్వారా కాంతి వేగంతో దాదాపు సమానమైన వేగాన్ని సాధించటాన్ని ఇందులో చర్చించారు. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌’లో ప్రచురితమైంది.

‣ పవర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ ఫర్‌ ఏ సోలార్‌-పవర్‌ ఎంబెడెడ్‌ డివైస్‌: సిమ్యులేటర్‌ సాయంతో సౌరశక్తిని మరింత సమర్థంగా ఎలా వినియోగించుకోవచ్చో ఇందులో వివరించారు. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌’లో ప్రచురితమైంది.

‣ ఐ బాల్‌ కంట్రోల్‌ స్టెయిర్‌ క్లైంబింగ్‌, గ్యాస్‌ డిటెక్షన్‌ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ బాట్‌ విత్‌ బీసీఐ అండ్‌ ఐవోటీ: మంటలను ఆర్పటం వంటి వివిధ రకాల పనులు చేసే రోబోకు సంబంధించిన పత్రమిది. కళ్ల కదలికలు, బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌, స్మార్ట్‌ఫోన్‌తోనూ రోబోను నియంత్రించటం గురించి ఇందులో చర్చించారు. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’లో ప్రచురితమైంది.

‣ ఎగ్జిస్టెన్సీ ఆఫ్‌ గోస్ట్స్‌ అండ్‌ పారానార్మల్‌ ఎంటిటీస్‌: దయ్యాల వంటి నమ్మకాల మీదున్న వివిధ సిద్ధాంతాలు, భావనలను ఇందులో చర్చించారు. ఈ ఆర్టికల్‌ ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌’లో ప్రచురితమైంది.

‣ స్టడీ అండ్‌ ప్రాక్టికల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ నానో సూపర్‌ కెపాసిటర్స్‌: మరింత ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే నానో సూపర్‌ కెపాసిటర్స్‌ గురించి చర్చించిన పత్రమిది. ‘ఎల్‌సేవియర్‌’లో ప్రచురితమైంది.

‣ ఈజ్‌ టైం ట్రావెల్‌ పాజిబుల్‌:  కాల ప్రయాణానికి సంబంధించిన ‘టైం బెండింగ్‌’, ‘టైం డైలేషన్‌’ గురించి ఇందులో చర్చించారు. అధిక ద్రవ్యరాశి కలిగిన బ్లాక్‌ హోల్స్‌, న్యూట్రాన్‌ స్టార్స్‌ గురించి వివరించారు.

- కాకర్ల వాసుదేవరావు, ఈనాడు, గుంటూరు

Posted Date : 05-06-2021 .